జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను ‘పవన్‌నాయుడు’ అని వైసీపీ అనడంపై స్పందించారు. పేరులో లేని పదాలను తనకు ఆపాదించడం మానుకోవాలని హెచ్చరించారు. ‘ఏ కులంలో, ఏ మతంలో పుట్టాలనే అవకాశం మన చేతుల్లో లేదు. కానీ, ఎలా ప్రవర్తించాలో మన చేతుల్లో ఉంటుంది’ అని పవన్ వ్యాఖ్యానించారు.
తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని ఉద్దేశపూర్వకంగానే అన్నానని, ఈ వ్యాఖ్యలకు మంత్రి బొత్స బాధపడిపోతున్నారని పవన్ విమర్శించారు. ‘ముందు మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పండి’ అంటూ వైసీపీ నేతలపై ఘాటుగా విమర్శించారు. ‘విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడటానికి ఇంగితజ్ఞానం లేదా? అంటూమండిపడ్డారు. ‘మట్టిలో కలిసిపోతారు అనే మాటను నేను ఆవేశంలో అనలేదు. తెలుగుభాషను మీరు అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని మరోసారి చెబుతున్నా. మా పార్టీది భాషల్ని గౌరవించే సంప్రదాయం’ అని పవన్ అన్నారు.