Pawan Kalyan speech at pithapuram: జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. తాను పోటీ చేస్తున్నందున ఈ మాట అనడంలేదని స్పష్టం చేశారు.
పిఠాపురం శ్రీపాద వల్లభ స్వామి జన్మించిన ప్రాంతం అని తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం చాలా కీలకమైన ప్రాంతం అని, కేవలం విజయం సాధించడానికే అయితే గత ఎన్నికల సమయంలోనే ఇక్కడ్నించి పోటీ చేసేవాడ్నని పవన్ వెల్లడించారు. గాజువాక, భీమవరం, పిఠాపురం తనకు కళ్లు లాంటివని పేర్కొన్నారు.
“నేను రాష్ట్రంలోనూ, పక్క రాష్ట్రాల్లోనూ వేరే వాళ్ల గెలుపు కోసం ప్రచారాలు చేశాను. కానీ నేను కూడా గెలవాలన్న ఉద్దేశంతో పిఠాపురం ప్రజలు వచ్చి నన్ను ఇక్కడ్నించి పోటీ చేయమని కోరారు. నువ్వు అసెంబ్లీలోకి వెళ్లే సంగతి మేం చేసుకుంటాం… నువ్వు రాష్ట్రం సంగతి చూడు అని నాకు నచ్చచెప్పారు. ప్రజల కోసం బలంగా నిలబడే నాయకులకు బలం ఇవ్వాలని పిఠాపురం ప్రజలు గట్టిగా నిలబడ్డారు.
ఇక నుంచి పిఠాపురం నా సొంత ఊరు. ఇక్కడే ఉంటాను… రాష్ట్రం దశ దిశ మార్చేందుకు ఇక్కడ్నించే పనిచేస్తాను. పిఠాపురంను ఒక ఆదర్శ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతా. ఒక ఎమ్మెల్యే తలచుకుంటే ఏ విధంగా అభివృద్ధి చేయగలడో నేను చేసి చూపిస్తాను. ఒక్కసారి ఎమ్మెల్యేగా నా పనితీరు చూస్తే ఎప్పటికీ నన్ను వదులుకోరు” అని పవన్ కళ్యాణ్ వివరించారు.