HomeTelugu Newsఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపడం న్యాయమా?

ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపడం న్యాయమా?

9 2
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినా ఆ రోగులకు వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలాంటి వైద్యులు, సిబ్బందికి అవసరమైన పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈలు ఇవ్వకుండా వైరస్‌తో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మెడికల్‌ మాస్కులు, గౌన్స్‌, గ్లోవ్స్‌, కంటి అద్దాలు అందజేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాటిని తగినవిధంగా సమకూర్చకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. ఎన్‌-95 మాస్కులు కూడా సమకూర్చలేదని.. సాధారణ డిస్పోజబుల్‌ గౌన్స్‌ మాత్రమే ఇస్తున్నారనే వైద్యుల మాటను ఒకసారి వినండి. నిర్దేశించిన విధంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు, దుస్తులు ఇస్తేనే వాళ్లు ధైర్యంగా విధులు నిర్వర్తించగలరు. వైద్యులు, సిబ్బందికి ఇస్తున్న పీపీఈలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. తమతో పాటు తమ కుటుంబం ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్న వారి సేవలను గుర్తించాలి. వారిని ఆపదలోకి నెట్టేయకుండా అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలి’ అని ఏపీ ప్రభుత్వానికి పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu