జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని, రాష్ట్రమంతటిదని చెప్పారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధానిని మార్చుకుంటూ పోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్ జనసేన కార్యాలయంలో పవన్‌తో రాజధాని ప్రాంత రైతుల బృందం శనివారం కలిసింది. రాజధాని పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈ సందర్భంగా వారు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. రైతుల ఆవేదన అర్థం చేసుకున్నానని, వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. ఇప్పటికే చేపట్టిన పనులు, నిలిచిన ప్రాజెక్టులను పరిశీలిస్తానని పవన్ వెల్లడించారు.