pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్‌కు ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌తో పాటుగా చిన్న పార్టీల నుంచి పోటీ తప్పడం లేదు. పిఠాపురం బరిలో భారత చైతన్య యువజన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు పోటీకి దిగాయి.
తాజాగా పవన్‌కు నవరంగ్ పార్టీ నుంచి తలనొప్పి మొదలైంది.. ఆ పార్టీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీకి దిగుతోంది. అంతేకాదు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ కాగా.. ఇది చూడటానికి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసులాగే ఉంది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు.. జనసేన పార్టీ గుర్తుకు దగ్గర పోలిక ఉంది. దీంతో ఓటర్లకు కన్ఫ్యూజన్ అవుతారని.. కొందరు పొరపాటున జనసేనకు బదులుగా నవరంగ్ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలో ఇప్పుడు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అభ్యర్థి ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని పిఠాపురం నుంచి పోటీలో దించుతోందట నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. పేరు కొణిదెల పవన్ కళ్యాణ్.. సింపుల్‌గా కె. పవన్ కళ్యాణ్.. ఇక నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కనుమూరి పవన్ కళ్యాణ్ కూడా కె. పవన్ కళ్యాణే.
దీనికి తోడు బకెట్, గాజు గ్లాసు చూడడానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఓటర్లను తికమక పెట్టడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది జనసైనికుల వాదన. అసలు..ఈ కనుమూరి పవన్ కళ్యాణ్ ఎవరు? ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద నవరంగ్ కాంగ్రెస్ జనసేనానికి తలనొప్పిగా మారింది.