జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి ఆ పార్టీకి విరాళం ఇచ్చారు. రూ.4లక్షల చెక్కును పవన్‌కు అందజేశారు. స్వయంగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమె విరాళానికి సంబంధించిన చెక్కును తన కుమారుడికి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ రద్దు కోసం చేస్తున్న పోరాటానికి జనసేన మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పెన్షన్ విలువేంటో తనకు తెలుసునని, అందుకే పెన్షన్ కోసం ఉద్యమిస్తున్న వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తన తల్లి అంజనాదేవి హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో పవన్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా అంజనాదేవి తనను కలిసిన జనసేన పార్టీ ప్రతినిధులతో మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమతో కూడుకున్నదని, అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కల్యాణ్‌కు చెప్పానన్నారు. తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్ల తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ మొత్తాన్నే జనసేన పార్టీకి విరాళంగా అందచేసినట్లు తెలిపారు. ఇటీవలే జనసేనలో చేరిన నాదెండ్ల మనోహర్‌తో పాటు ఇతర నేతల్ని తన తల్లికి పవన్ పరిచయం చేశారు.