జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు మదనపల్లిలో పర్యటించారు. మదనపల్లిలో టమాటా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రైతుల సమస్యలను అడిగితెలుసుకున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పనితీరుపై మండిపడ్డారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పవన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి. సమావేశాలు ముగిసేలోగా రైతుల సమస్యలు పరిష్కరించాలి, లేదంటే రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని చెప్పారు. మొదట రైతులకు అన్నంపెట్టి ఆ తరువాత మిగతా పనులు చూసుకోవాలని అన్నారు. రైతులకు భరోసా ఇవ్వకుంటే అమరావతిలో ప్రదర్శన చేస్తానని పవన్
పేర్కొన్నారు.