జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పై స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠిన నిర్ణయాలను తీసుకోకూడదని జనసేన పార్టీ అభిప్రాయపడుతోందని పవన్ తెలిపారు. 48 వేల 600 వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయని పవన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగం చేపట్టిన సకల జనుల సమ్మెలో RTC కార్మికుల పాత్రను మర్చిపోకూడదన్నారు పవన్ కళ్యాణ్. సమస్యను సీఎం కేసీఆర్ సామరస్యంగా పరిష్కరించాలన్నారు జనసేనాని. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగసంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశామని, ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా వుందని పవన్ అన్నారు.