సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ మరింత దూకుడు పెంచుతోంది.. ఇప్పటికే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. భారీ ఎత్తున ప్రకటనలకు ఖర్చు చేయకుండా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 17 ప్రచార రథాలను సిద్ధం చేసింది జనసేన. వాటిపై జనసేన సిద్ధాంతాలు, అధికారంలోకి చేపట్టబోయే పథకాల వివరాలను ముద్రించారు. ప్రజలలోకి వెళ్లేందుకు ప్రచార రథాలను కూడా ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. రథాలను సిద్ధం చేసిన ఎన్నారైలను, సిబ్బందిని ఈ సందర్భంగా పవన్ అభినందించారు.
ఒక్కో ప్రచార రథం రోజుకు 10 గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తుంది. మొత్తం 17 ప్రచార రథాలు రోజుకు 170 గ్రామాల్లో తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోను ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించారు. మరో 17 రథాలు సిద్ధం అవుతున్నాయి. ప్రచారంలో భాగంగా పార్టీ గుర్తు గాజు గ్లాస్ తో ప్రజలకు టీ ఇవ్వడంతో పాటు మెంబర్ షిప్ డ్రైవ్ చేయనున్నారు. అలాగే ప్రచార రథాల్లో అమర్చిన ఎల్ఈడీల ద్వారా ఓటర్లను ఆకట్టుకునే విధంగా రోజుకు 2 మెయిన్ సెంటర్లలో శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రసారం చేస్తారు.