చేనేత చాలా గొప్ప అరుదైన కళ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలోని చేనేత కళాకారులతో సమావేశమయ్యారు. చేనేత గొప్పతనాన్ని తెలపడానికే తాను పంచె కడుతున్నట్టు చెప్పారు. కులం పేరుతో గెలిచిన నాయకులు న్యాయం చేసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవన్నారు. 2019 ఫిబ్రవరిలో చేనేత కార్మికులతో భారీ సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తాను ఉదయిస్తున్న తరాలకు ప్రతినిధినన్నారు. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబులా తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని ఎద్దేవా చేశారు. ఎవరు తప్పుచేసినా ప్రజలు నిలదీయాలన్నారు. చివరకు తాను తప్పు చేసినా ప్రజలు తన చొక్కా పట్టుకొని నిలదీయాలన్నారు. నేతన్నల సంక్షేమం జనసేనతోనే సాధ్యమని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్.