జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీలో కరోనా నియంత్రణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కొందరు అధికారపార్టీ పెద్దలు దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రజలను ఆదుకోవాల్సిన విపత్కర సమయంలో చిల్లర రాజకీయాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.
”ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ని సైతం విడిచిపెట్టలేదు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు ..పెరుగుతున్న పాజిటివ్ కేసులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో తప్పులు ఎత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికారపార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. వైద్య సేవలు అందించాల్సిన తరుణంలో రాజకీయాలను భుజాలకెత్తుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాల్సిన అవసరముంది. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదాం. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తిల్ని కేంద్రీకరిద్దాం. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది” అని పవన్ కల్యాణ్ అన్నారు.