రాజధాని ప్రాంత రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఏపీ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసుల బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దీంట్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. ఇలాంటి చర్యలతో శాంతియుతంగా సాగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు రాజధాని గందరగోళానికి వైసీపీ ప్రభుత్వం తక్షణం తెరదించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులను భయబ్రాంతులకు గురి చేస్తూ మహిళలను, వృద్ధులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న తీరు ఎంతమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. రెండుమూడు రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతుల విషయంలో ప్రభుత్వ చర్యలు ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి చర్యలే రాష్ట్ర అభివృద్ధి
అవకాశాలను దెబ్బ తీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం తక్షణం మానుకోవాలని, రాజధానిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.