‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరుతో రైతుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడలో ఒక రోజు నిరసన దీక్ష చేశారు. ఉదయం 8 గంటల నుంచి సా. 6 గంటల వరకు దీక్ష చేశారు. పవన్ కల్యాణ్‌కు రైతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
రైతుకు పట్టం కట్టేందుకే జనసేన పార్టీ పుట్టిందని అన్నారు. అన్నదాత కన్నీరు ఆగే వరకూ తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు మాయమాటలు చెబుతున్నవాళ్లు బాగున్నారని, రైతులే కన్నీళ్లు కారుస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా ఓటమిపాలైతే ఆ పార్టీకి చెందిన వారి ఆత్మసైర్యం దెబ్బతింటుంది కానీ, తనకు మాత్రం ఆత్మస్థైర్యం దెబ్బతినలేదని అన్నారు.
జనసేన సహనం మా బలం… బలహీనత కాదు. దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్నదాత కన్నీరు ఆగే వరకు పోరాడతా. తినే గింజలకు కులం లేనప్పుడు రైతుకెందుకు కులం. వైసీపీ నేతలకు రైతుల కడుపుకోత కనబడటం లేదు. జనసేన పార్టీ పదవుల కోసం పుట్టింది కాదు. ప్రజల సమస్యల కోసమే జనసేన పుట్టింది. రైతు మనుగడ కష్టంగా మారింది. కూల్చివేతలతోనే వైసీపీ పాలన మొదలు పెట్టింది. వచ్చిన పది రోజుల్లోనే కూల్చివేతలు మొదలు పెట్టారు. ఇప్పుడు రైతుల జీవితాలను కూల్చివేస్తున్నారు. నన్ను ఎవరూ ఎం చేయలేరని సీఎం జగన్‌కు అనిపించొచ్చు.. ఎంతో మంది రాజులు, చక్రవర్తులే కాల గర్భంలో కలిసిపోయారు.. మీరెంత.. మీ 150 మంది ఎమ్మెల్యేలు ఎంత అన్నారు.