AP Elections 2024: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం భీమవరంలో పవన్ కల్యాణ్.. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడ.. ఇద్దరు వ్యక్తులు ఆనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ వ్యక్తుల నుంచి పోలీసులు చాకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా.. ఫ్యాన్స్ పేరుతో కొందరు బ్లేడ్లతో చేతులు కోస్తున్నారు అని ఆరోపించిన సంగతి తెలిసిందే. తనతోపాటు తన భద్రత సిబ్బందిపైన బ్లేడ్లతో దాడి జరిగిందని తెలిపారు. ఇక కాకినాడ వారాహి యాత్రలో తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు.
అదేవిధంగా పవన్.. తెనాలి పర్యటనలో ఉండగా.. ఆయనపై ఆగంతకుడు రాయితో దాడి చేశారు. ఈ వరుస పరిణామాలను పరిశీలిస్తే పవన్‌కు ప్రాణ హాని ఉందని స్పష్టమవుతుందని జన సైనికులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. అదీకాక .. ఎన్నికలు సమీపిస్తున్న టైమ్‌లో పవన్ భద్రతపై వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు బయటకు వస్తే.. వారిపై ఓ విధమైన కఠిన వైఖరితో ఈ ప్రభుత్వం వెళ్తుందని వారు ఆరోపిస్తున్నారు. గతంలో విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో కూడా పవన్ కల్యాణ్‌పై జగన్ ప్రభుత్వం చాలా అమానుషంగా వ్యవహరించిందని వారు గుర్తు చేశారు.
ఆ సమయంలో హోటల్ గది నుంచి బయటకు వచ్చి గాలి పీల్చుకోవచ్చా? అంటూ ఎక్స్ వేదికగా పవన్ ప్రశ్నించిన విషయాన్నిఈ సందర్బంగా వారు ప్రస్తావిస్తున్నారు. పవన్‌కు ఇతర ప్రతిపక్ష పార్టీల మధ్య దూరం పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం ఈ తరహాగా వ్యహరించిందని మండిపడుతున్నారు. ఆ క్రమంలో పోలీసు అధికారులు సైతం అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని… ఆ సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న పవన్ కల్యాణ్‌పై జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.
అలాగే తమ పొలాల్లో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించుకోవచ్చునని ఇప్పటం గ్రామస్తులు.. పవన్ కల్యాణ్‌కు తెలిపారు. ఆ క్రమంలో ఆ గ్రామంపై జగన్ ప్రభుత్వం ఎంత మెండి వైఖరితో వెళ్లిందో అందరికి తెలిసిందేనని వారు వివరిస్తున్నారు. ఆ గ్రామాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కల్యాణ్‌ను సైతం పోలీసులతో నిలువరించేలా వ్యవహరించారని జనసైనికలు పేర్కొంటున్నారు.
ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు చేరువ కాకూడదనే లక్ష్యంతో అధికార పార్టీ పక్కా ప్రణాళికతో ఈ తరహాగా వ్యవహరిస్తున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. ప్రజలు కట్టిన పన్నులు జీతాలుగా తీసుకుంటూ… అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసుల వైఖరిని వారు తప్పు పడుతున్నారు.