ఊపిరి ఉన్నంతవరకు జనసేన జెండా దించే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలతో జనసేనకు సంబంధాలను అంటగట్టడం మానుకోవాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నిడదవోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోల్లో పవన్ మాట్లాడారు. జనసేన అధికారంలోకి వస్తే మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద ఆడపడుచుల పెళ్లిళ్లకు రూ.లక్ష చొప్పున అందిస్తామన్నారు. చీర-సారె పథకం ద్వారా మహిళలకు రూ. 10,116 ఇస్తామని పవన్ ప్రకటించారు. టీడీపీ, వైసీపీ అనే కంసులకి జనసేన అనే కృష్ణుడంటే భయమని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని పదేపదే దెబ్బతీస్తుంటే తన భాషను మార్చుకోవాల్సి వస్తుందన్నారు. నేను లెక్కలేసుకుని రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవకోసమే వచ్చానని పవన్ స్పష్టం చేశారు. జగన్‌లా తనకు అక్రమాస్తులు.. చంద్రబాబులో ఓటుకు నోటు కేసు తనపై లేవన్నారు. ప్రజలు కోరుకుంటోంది జనసేన ప్రభుత్వమేనని చెప్పారు. జనసేన ప్రభుత్వం వచ్చాక డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతామన్నారు. ప్రజలు తన ఫొటో ఇళ్లల్లో పెట్టుకోవాలని జగన్ కోరుకుంటున్నారని, రెండేళ్లు జైలుకు వెళ్లిన జగన్ ఫొటోను ఎలా పెట్టుకుంటారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3లక్షల ఉద్యోగాలను ఆర్నెళ్లలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల నుంచి భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారని, తాను మాత్రం లక్ష ఎకరాల భూమిని సేకరించి లక్షమంది యువ రైతులను తయారు చేస్తానని చెప్పారు. యువతకు పెద్ద చదువులు అక్కర్లేదన్న పవన్.. కష్టపడే తత్వం వారికి ఉంటే చాలన్నారు. పదో తరగతి పాసైన యువతను స్పెషల్ పోలీస్ కమాండోలుగా నియమిస్తామన్నారు. జనసేన వచ్చాక పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రకటించారు. చిన్న , ఫుట్‌పాత్ వ్యాపారులకు పూచీకత్తు లేకుండా రూ.10వేల రుణం ఇస్తామని, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని చెప్పారు.