పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. కేవలం హీరోగా నటిస్తూ.. సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా.. తన దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ‘జనసేన’ అనే రాజకీయ పార్టీను స్థాపించారు. నిజమైన నాయకుడుగా జనాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పవన్ కల్యాణ్ రూపంలో ఓ పవర్ వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారు. నిజంగా పవన్ కల్యాణ్ వెనుక పవర్ ఉందా..? ఆయన లాజికల్ గా అడిగే ప్రశ్నలు సామాన్య ప్రజలకు అర్ధమయ్యే విధంగా… మన రాజకీయ నేతలకు ఎందుకు అర్ధం కావడం లేదు..? ఒకవేళ అర్ధమయినా.. వారి దగ్గర పవన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేని కారణంగానే ఏ విషయంలోనూ.. స్పందించకుండా.. ఊరికే చూస్తూ ఉన్నారా..?
ప్రతి విషయంపై చాలా లేట్ గా పవన్ స్పందిస్తూ.. ఉంటారని నేతలు మాటలు దాటేయడం కూడా ఒకరకంగా వారి తప్పించుకోవడానికి మార్గం వెతుకుంటున్నట్లే.. పదవిలో ఉంటూ ప్రజలను పాలించేవారి దగ్గర ఏ ప్రశ్నకు జవాబు లేకపోతే ఎలా..? చిన్న చిన్న విషయాలపై చానల్స్ వరకు వెళ్ళి లైవ్ లో కూర్చొని ఆ విషయంపై డిబేట్ చేసే రాజకీయ నేతలు, కార్యకర్తలు పవన్ ప్రశ్నపై ఎందుకు డిబేట్ చేయడానికి ముందుకు రావడంలేదు..? కనీసం వాటిపై స్పందించడానికి కూడా ఎందుకు ఇష్టపడడం లేదు..? ఎందుకంటే పవన్ దేశ ద్రోహి కదా.. అవును.. మన దేశంలో ఎవరు ప్రశ్నించడానికి ముందుకు వచ్చినా.. వారిపై దేశద్రోహి అనే ముద్ర వేస్తుండడం మన నేతలకు అలవాటైన విషయమే.. గతంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఇలానే ప్రశ్నిస్తున్నాడని అతడిని దేశద్రోహి అంటూ సంభోదించారు. మరి ఇప్పుడు పవన్ కూడా ప్రజల కోసం ఆలోచించి.. తన ప్రశ్నల అస్త్రాన్ని ఎక్కుపెడుతున్నాడు కదా..! ఆయనను కూడా దేశ ద్రోహి అనే అంటారా..?
పవన్ అడిగిన ఐదు ప్రశ్నలు.. గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, పెద్ద నోట్ల రద్దు వ్యవహారం, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా.. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.
గోవధను నిషేదించడానికి పవన్ చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ఒక్కో గోవును ఎందుకు దత్తత తీసుకోవడం లేదు..?
ఏ రాజకీయ పార్టీ సమావేశాలు కూడా జాతీయగీతంతో మొదలవ్వవు.. అలాంటప్పుడు సినిమా థియేటర్లు మాత్రం జాతీయగీతానికి పరీక్ష కేంద్రాలుగా ఎందుకు మారాలి..?
ఓ ప్రముఖ రచయిత ‘ఒకవేళ బూతు సినిమా వేసే ముందు జాతీయగీతం ఆలపిస్తే ఏ విధంగా దాన్ని సమర్ధించుకోగలరు’ అని స్పందించారు. అలా ఊహించుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది.
రోహిత్ వేముల వంటి తెలివైన విధ్యార్థి ఆత్మహత్యకు కారణం తనపై విధించిన సస్పెన్షన్.. మన దేశంలో తప్ప మిగిలిన ఏ దేశాల్లో అయినా.. ప్రశ్నించే వాడు ముందుకు వస్తే ముందు అతడు చెప్పే విషయాలను గమనిస్తారు. కనీసం మన దగ్గర ఆ విచక్షణ కూడా లేకుండా, కౌన్సిలింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ విధించి అన్యాయంగా ఓ మేధావి చావుకి కారణమయ్యింది కేంద్రప్రభుత్వం..
రాష్ట్రం రెండుగా విడుదలయిన తరువాత ‘స్పెషల్ స్టేటస్’ ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గుతోంది. స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ అనే పదం తప్ప మరొక స్పెషల్ లేదు..
పెద్ద నోట్ల రద్దు విషయంపై సినిమా పరిశ్రమకు చెందిన వారు పాజిటివ్ గా స్పందించారు. సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ భావితరాల కోసం తమ ఇబ్బందిని పెద్దగా పట్టించుకోవడం లేదు.. మరి రాజకీయ నాయకులు మాత్రం ఎందుకు దీనికి వ్యతిరకంగా నినాదాలు చేస్తున్నారు..? వీటన్నింటిపై పవన్ ప్రశ్నించిన తీరులో సామాన్య ప్రజలకు తప్పుందని ఏ మూలన అనుమానం కలగడం లేదు. మరి పవన్ మాటలకు స్పందించని నాయకులది తప్పా..? లేక వారు అసలు పవన్ మాటల్లో అర్ధం లేదని భావిస్తున్నారా..? ఇప్పటివరకు ఎవరికి నచ్చినట్లుగా వారు పాలిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నించడానికి ఒకరు ముందుకు వచ్చేసరికి నిజంగానే భయపడుతున్నారా..?