AP Elections 2024: గుడివాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వైసీపీ నాయకులు తిట్టిన ప్రతీ తిట్టుకు ట్యాక్స్ వేస్తే రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యా, వైద్యం అందించవచ్చన్నారు. 30 కేసుల్లో 5 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తిని గెలిపిస్తే, విశాఖలో రూ.25 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారని, ఇంకోసారి అవకాశం ఇస్తే మీ ఆస్తులు తాకట్టు పెడతారని విమర్శించారు.
వైసీపీ మద్దతుదారులు కూడా వైసీపీకి ఓటు వేయకండని పవన్ కోరారు. వైసీపీ మద్దతుదారులు జగన్ కు ఓటు వేస్తే మీ ఆస్తులపై మీరే హక్కు వదిలేసుకున్నట్లు, గాలిలో దీపంలా మీ ఆస్తులు పెట్టినట్లే అన్నారు. పేకాట క్లబ్బులు నిర్వహించడానికి, దందాలు చేయడానికి, భూములు దోచేయడానికి వైసీపీ సిద్ధం అని విమర్శించారు.
ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ఎందుకు తీసేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. మీ నాన్న కంటే ముందు చాలా మంది గొప్పవాళ్లు ఉన్నారని సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారు. మీ నాన్న పేరు పెట్టుకోవద్దని అనడం లేదు, ఇతర మహనీయులు ఎంతోమంది ఉన్నారు, వారికి గౌరవం కల్పించాలన్నారు.
కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రామును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ నోరు పారేసుకునే ఎమ్మెల్యే నోరు మూయించాలని కోరారు. గుడివాడకు వచ్చే రోడ్డు గోతులమయం, దాని మీద ప్రశ్నిస్తే ఇక్కడి నాయకులు బూతు పురాణాలు మొదలుపెడతారని మండిపడ్డారు.
“రాష్ట్రంలో దాదాపు 7 వేల ఎయిడెడ్ స్కూల్స్ వైసీపీ ప్రభుత్వం మూసేసింది. ప్రభుత్వం, పేద విద్యార్థులకు విద్యను దూరం చేసి, వారిపై భారం మోపింది జగన్ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వస్తుంది, మెజారిటీ ఎంత అనేది మాత్రమే లెక్క తేలాల్సి ఉంది. జనసేన – తెలుగుదేశం – బీజేపి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాయి” అని పవన్ కల్యాణ్ అన్నారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారని పవన్ విమర్శించారు. మన భూముల మీద లోన్ తెచ్చుకుందామంటే కనీసం ఒరిజినల్ పేపర్లు కూడా మన దగ్గర లేకుండా ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటాం అంటున్నారన్నారు. మీ భూములపై మీకు హక్కు లేకుండా చేస్తున్నారన్నారు. ముందు పట్టా పుస్తకాలపై బొమ్మ వేసుకున్నారు, తరవాత సరిహద్దు రాళ్ల మీద బొమ్మ వేసుకున్నారు, ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుని, జిరాక్స్ కాపీలు మనకు ఇస్తారట, వీటితో లోన్స్ ఎవరైనా ఇస్తారా? ఇలాంటి పిచ్చి చట్టం తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు.