Homeపొలిటికల్AP Elections 2024: కలలు నిజం చేస్తాడా?.. జగన్‌ హోర్డింగ్‌పై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

AP Elections 2024: కలలు నిజం చేస్తాడా?.. జగన్‌ హోర్డింగ్‌పై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

AP Elections 2024

AP Elections 2024: జనసేనాని పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రసంగం మధ్యలో అక్కడే సీఎం జగన్ హోర్డింగ్ ఉండడాన్ని పవన్ కళ్యాణ్ గమనించారు. ఆ హోర్డింగ్ పై జగన్ బొమ్మతో పాటు కలలు నిజం చేయడానికి… జగన్ కోసం సిద్ధం అని రాసి ఉంది.

కెమెరా అటు తిప్పండయ్యా… అంటూ పవన్ ఆ హోర్డింగ్ ను చూపించారు. కలలు నిజం చేయడానికి అంట… మెగా డీఎస్సీ ఇచ్చి మీ కలలు నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా? అంటూ ప్రశ్నించారు.

మహా మల్లయోధుడు కోడి రామ్మూర్తి ఇక్కడి వీరఘట్టం నుంచే వచ్చారని, ఒంటి చేత్తో గొలుసులను తెంపేవారని పవన్ కొనియాడారు. ఇక్కడ కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. జగన్ కానీ, ఇక్కడున్న వైసీపీ నేతలు కానీ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని అడిగారా? అని ప్రశ్నించారు. మరెందుకయ్యా… ఆ పోస్టర్ సిద్ధం సిద్ధం అంటూ… ఏం కలలు నిజం చేస్తాడు? అంటూ ధ్వజమెత్తారు.

మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, కానీ రూ.60 క్వార్టర్ ను రూ.200కి అమ్ముతున్నాడు… 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోతే వారి ఇంట్లో వాళ్ల ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. కానీ రద్దు చేయలేదు… ఇంకేం కలలు నిజం చేస్తాడు? అంటూ పవన్ నిలదీశారు. తనకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు అని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర ప్రాంతం, భాష, యాస గుండె కదిలించేస్తాయని అన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో తిరిగిన వాడ్ని, ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్)లో తిరిగిన వాడ్ని, కష్టాలు చూసినవాడ్ని, యువత కడుపు మంట తెలిసిన వాడ్ని, ఉపాధి అవకాశాల్లేక వలస వెళ్లిపోతున్న యువత ఆక్రోశాన్ని అర్థం చేసుకున్నవాడ్ని అని వివరించారు. అందరిలాగా ఓటమిని అంగీకరించి పారిపోవడం నా వల్ల కాదు… అందుకే దశాబ్దకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను అని వెల్లడించారు.

నాకు నిలబడడం ఒక్కటే తెలుసు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కళామతల్లి ద్వారా తాను ఆటా పాటా నేర్చుకున్నానని చెబుతూ పవన్ కల్యాణ్ ‘మల్లీ నీకెందుకురా పెళ్లి’ అనే గీతాన్ని ఆలపించారు. అంతేగాకుండా, ఏం పిల్లడో ఎల్దమొస్తవా, బాయ్ బాయే బంగారు రమణమ్మ అనే గీతాలు ఉత్తరాంధ్రలో తిరిగినప్పుడు తనకు పరిచయం అయ్యాయని వివరించారు.

ఉత్తరాంధ్ర యాసను తెలుగు సినిమాల్లో పెట్టాలా, వద్దా అని చాలామంది ఆలోచిస్తుంటారని, కానీ ఉత్తరాంధ్ర యాస తన గుండెల్లో మోగుతుంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు వాడుక భాషోద్యమం చేపట్టిన గిడుగు రామ్మూర్తి గారు సవర భాష అంతరించిపోకుండా ఆ భాషకు ఓ నిఘంటువును కనిపెట్టారని కొనియాడారు. శ్రీశ్రీ వంటి మహాపండితులు, ఉద్ధండులను అందించిన నేల ఈ ఉత్తరాంధ్ర అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu