జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలే గందరగోళానికి కారణమయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారు. రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా? అని నిలదీశారు. రెండు రోజుల రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా తుళ్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాజధాని రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాజధానికి అవసరమైన డబ్బు జగన్ తన జేబులోంచి తీసి ఇవ్వడం లేదని పవన్ అన్నారు. హైదరాబాద్‌కు దీటుగా ఏపీ రాజధాని ఉండాలని ఆకాంక్షించారు. రాజధాని విషయంలో మాజీ సీఎం చంద్రబాబు అనుసరించిన వైఖరి అపోహలకు దారితీసిందని ఆరోపించారు. వేల ఎకరాల సేకరణ వల్లే అవినీతి జరిగిందని అనుమానాలు వచ్చాయని ఆయన అన్నారు. అన్ని ఎకరాలు అవసరం లేదని తాను గతంలో వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని తాను మాటిస్తున్నా అని పవన్ అన్నారు. అంతకుముందు రాజధాని ప్రాంతంలోని నిడమర్రు, కూరగల్లులో పర్యటించారు.