Pawan Kalyan: అంబేద్కర్ కోనసీమ జిల్లా.. పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట లో జనసేన అదినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ మాఫియాను ఏపీ నుంచి తన్ని తరిమేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఇదని చెప్పారు. పూలే జయంతి, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ సీమగా ఉన్న కోనసీమను జగన్ కలహాల, కొట్లాట సీమగా చేశారని మండిపడ్డారు. రాజకీయ దురందురుడు చంద్రబాబు అని కొనియాడారు. కోనసీమలో క్రాప్ హాలిడే రాకుండా చూసుకుంటామని చెప్పారు.
జగన్ కోనసీమకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 2022 జూలైలో జగన్ పర్యటించి రూ. 30 కోట్లు హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆడబిడ్దలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం మనకు అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచారని మండిపడ్డారు.
చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. మంచి నీళ్లు అడిగితే కోనసీమ వాసులు కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి సంస్కరం ఇక్కడ ఉందని కానీ కోనసీమ జిల్లాలో ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా జగన్ కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. కాటన్ దొర పని చేసినట్టు మేం కూడా అలానే పని చేస్తాం అన్నారు.
జగన్ ఒక్క డీఎస్సీ ఇవ్వలేదని, ఉద్యోగాలు ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బ తీశారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలు జగన్ రద్దు చేశారని విరుచుకుపడ్డారు.
దళితులకు విదేశీ విద్య రద్దు చేశారన్నారు. 6 వేల మంది దళితులపై కేసులు పెట్టారని వాపోయారు. 186 మంది దళితులను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాపులకు న్యాయం చేస్తామని మాటిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదల సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు.
అంబాజీపేటలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్థరిస్తాం. యువతకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మా అన్నయ్య చిరంజీవి నేర్పించిన నైపుణ్యంతో నేను ఇంత వాడిని అయ్యాను. మూడు నాలుగు సినిమాల్లో వచ్చిన డబ్బుతో కౌలు రైతులకు పంచాంఅంటూ పవన్ వ్యాఖ్యనించారు.