పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమాకి తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు పి.సముద్రఖని డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా పై మొదటి నుండి మంచి హోప్స్ ఉన్నాయి. టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేశారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.
కాలంతో పరిగెత్తే మార్కండేయ (సాయిధరమ్ తేజ్).. ఎప్పుడూ టైమ్ లేదు టైమ్ లేదు అంటూ చాలా బిజీగా గడిపేస్తుంటాడు. అతడికి తల్లి, తమ్ముడు, ఇద్దరు చెల్లెల్లు ఉంటారు. వాళ్లందరి బాధ్యత తనేదనని.. వాళ్లకు జీవితంలో సరైన మార్గం చూపించాలని ఒక తండ్రిలా తపన పడిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో వాళ్ల ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను అస్సలు పట్టించుకోడు. భవిష్యత్తు తాను ఊహించుకుంటున్నట్టే ఉండాలనుకుంటాడు. అయితే, అనుకోకుండా కారు యాక్సిడెంట్‌లో మార్కండేయ చనిపోతాడు. మార్క్ ఆత్మకు టైమ్ (పవన్ కళ్యాణ్) దర్శనమిస్తుంది. ‘అసలు నేను ఎందుకు చనిపోవాలి? నేనేం తప్పు చేశాను? నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది?’ అని టైమ్‌ని మార్క్ ప్రశ్నిస్తాడు. దానికి టైమ్ ఏం సమాధానం చెప్పింది? మార్కండేయకు ఎలా కనువిప్పు కలిగించింది? అనేదే సినిమా.
ప్రతి మనిషి జీవితంలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం ఎన్ని విన్యాసాలు చేసినా విధి ఆడించినట్టు ఆడాల్సిందే. ఆ విషయం తెలియక భవిష్యత్తు గురించి తెగ ఆలోచించేస్తూ, వర్తమానంలో తప్పులు చేస్తూ పోతే జీవితం ఉండదు, వర్తమానంలో మనం మనలా నిజాయతీగా బతికితేనే జీవితానికి అర్థం అని చెప్పడమే ఈసినిమా ఉద్దేశం.
నిజానికి ఇది మంచి కథ. కానీ, కమర్షియల్ సినిమా కథ కాదు. తమిళంలో సముద్రఖని ఒక చిన్న సినిమాగా ఈ కథను చెప్పారు. కాకపోతే, తెలుగులో మాత్రం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ చేరికతో ఇది కమర్షియల్ సినిమాగా మారింది. దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేశారు. అయితే, ఆయన పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
సినిమా మొదలైన 10 నిమిషాలకు పవన్ కళ్యాణ్ పాత్ర పరిచయం అవుతుంది. పవర్ స్టార్ రేంజ్‌కు తగ్గట్టే ఇంట్రడక్షన్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉంది. ఇక అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ లేకుండా ఒక్క సీన్ కూడా లేదు. ఫ్యాన్స్ కన్నులపండువలా ఉంటుంది. ప్రతి సీన్‌లోనూ పవన్ కళ్యాణ్ వింటేజ్ మేనరిజం కనిపిస్తుంది. దీనికి తోడు ఆయన గత సినిమాల్లోని పాటలను సందర్భానుసారంగా కథలో చొప్పించారు. ఇవి కూడా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పరోక్షంగా విసిరే పొలిటికల్ పంచ్‌లకు ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు.
ఇలా ఫస్టాఫ్ అంతా పవన్ కళ్యాణ్ మేనరిజం వెనుక కథను నడిపించారు దర్శకుడు సముద్రఖని. ఒక సాధారణ ప్రేక్షకుడికి ఎక్కడా గూస్‌బంప్స్ తెప్పించే సీన్లు ఉండవు. కథ చాలా ఫ్లాట్‌గా వెళ్లిపోతుంది. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్మెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సాదాసీదాగానే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఫస్టాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఫ్లాట్‌గానే సాగిపోయింది.
సెకండాఫ్‌లో సైతం పవన్ కళ్యాణ్ మేనరిజం, ఆయన పాత సినిమాల్లో పాటల మీదే దృష్టిపెట్టారనిపిస్తుంది. మార్కండేయ పాత్రలో రియలైజేషన్ ప్రేక్షకుడికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వదు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పెద్దగా పండలేదు. సెకండాఫ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. అలా అని పవన్ కళ్యాణ్ రేంజ్ కమర్షియల్ అంశాలు లేకపోయినా ప్రమాదమే. అవి కూడా లేకపోతే ఫస్టాఫ్ కూడా మనకు కనెక్ట్ అవ్వదేమో. మొత్తంగా చూసుకుంటే ఇది ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ మూవీ.
ఈ సినిమాకు బలం పవన్ కళ్యాణ్. సినిమా మొత్తం భారం ఆయన ఒక్కడే మెసినట్లు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోని కనిపించనంత ఎనర్జిటిక్‌గా పవన్ కళ్యాణ్ కనిపించారు. వింటేజ్ పవర్ స్టార్‌ను చూపించారు. ఆయన స్టైల్ కూడా అదిరిపోయింది. మార్కండేయ పాత్రలో సాయిధరమ్ తేజ్ పర్వాలేదనిపించారు. ఆయన నటన గత చిత్రాల్లో చూపినట్టుగానే ఉంది. హీరోయిన్ కేతిక శర్మ తన పాత్ర పరిధి మేర నటించారు. ‘జాణవులే’ పాటలో తన అందాలతో కిక్ ఇచ్చారు. రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిశోర్, రాజా చెంబోలు, తనికెళ్ల భరణి, అలీ రెజా, సుబ్బరాజు, తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.సినిమాకు మరో బలం తమన్ నేపథ్య సంగీతం. పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవన్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సాధారణంగానే ఉన్నాయి.
టైటిల్ :బ్రో
నటీనటులు: పవన్ కళ్యాణ్,సాయిధరమ్ తేజ్,కేతిక శర్మ,రోహిణి,ప్రియా ప్రకాష్ వారియర్,వెన్నెల కిషోర్,తనికెళ్ల భరణి,తదితరులు
దర్శకత్వం: సముద్రఖని
సంగీతం: తమన్
చివరిగా:పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ మూవీ ‘బ్రో’