టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఆయన సోదరుడు, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 22న చిరు 64వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా పవన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చిరు తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ‘ఇది అభిమానులందరికీ పండుగ రోజు. చిరంజీవి అంటే కేవలం ఒక మెగాస్టార్ కాదు. మూర్తీభవించిన స్ఫూర్తి. అబ్దుల్ కలాం చెప్పినట్లుగా.. ‘పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడటం’ అనే జీవనవేదానికి చిరంజీవి ప్రస్థానం నిదర్శనం. కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత నిగర్వంగా, నిరాడంబరంగా ఉండటం.. తన మూలాలను మరచిపోని స్పృహతో ఉండటం.. లాంటి జీవన విలువలకు ప్రతీక చిరంజీవి. తానే ఒక సందోహం, తన జీవితం ఒక సందేశం’.
‘ఆ సందేశాన్ని అందిపుచ్చుకున్న లక్షల మంది యువతరంలో నేనొక పరమాణువును కావడం అదృష్టం. అంతకుమించి, ఆయన తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం. అన్నయ్య నరసాపురంలో విద్యార్థిగా ఎన్‌సీసీలో ఉన్నప్పటి నుంచి, మద్రాసులో యాక్టింగ్ విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి.. ఇవాళ్టి వరకు అదే ఉక్కు క్రమశిక్షణ. అదే స్థాయిలో అనితర సాధ్యమైన నేర్చుకునే తత్వం. అసామాన్యమైన తన ప్రస్థానంలో ఎన్నెన్ని ఎదురుదెబ్బలు, కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా.. పట్టుదలతో వాటిని తొక్కేసుకుంటూ ఉన్నత శిఖరాలకు ఎగబాకిన ధీరత్వం. ఆయన వేసే ప్రతి అడుగు ఆదర్శం, అనుసరణీయం’.
ఇవాళ యావత్ భారతజాతి విస్మరించిన సమరాగ్రేసరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ‘సైరా’ అంటూ సినీ ప్రియులకు కానుకగా అందిస్తున్న చిరంజీవికి జన్మదినం సందర్భంగా నా తరఫున, జనసైనికుల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి. ఆయన జీవితం, మరింత మందికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉండాలని కోరుకుంటున్నా. ఆకాశం ఎప్పటికీ నిశ్చలంగా ఉంటుంది. కానీ దాని వల్ల గాలి అష్టదిక్కులకూ విస్తరిస్తుంది. చిరంజీవి మౌనిగా, మునిగా సుస్థిరంగా ఉంటారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నవతరాలను తీర్చిదిద్దుతూనే ఉంటుంది’ అని పవన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
🙏 My wholehearted Namaskars!! to all. pic.twitter.com/sTn1uHGtSU
— Pawan Kalyan (@PawanKalyan) August 21, 2019