అమరావతిలో రైతులు, రైతు కూలీలు, మహిళల ఆవేదన చూసి తన హృదయం ద్రవించిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని అన్నారు. అలాంటి రైతులు దైన్యంగా రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరాహార దీక్షలు, నిరసనలు చేస్తున్నారన్నారు. ఎప్పుడూ గడపదాటని మహిళలు సైతం రోడ్లపైకి రావాల్సిన దుస్థితి రావడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని అమరావతి రైతులు తనకు వివరించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో వేడుకలకు మనసు అంగీకరించడం లేదని పవన్ అన్నారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నందుకు బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. రాజధాని రైతులు, వారి కుటుంబాలు ఆనందంగా ఉన్నరోజే తనకు నిజమైన సంక్రాంతి అని అన్నారు.