జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఈ మేరకు ఓ లేఖ రాశారు. ముఖ్యంగా.. సినిమాల్లో నటించనంటూ పలు సందర్భాల్లో ప్రకటించిన మీరు.. మళ్లీ సినిమాలు చేస్తున్నారని.. మీ విధానాల్లో స్థిరత్వం లేదని పేర్కొన్నారు ఆయన. అయితే, లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. “లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నాం… ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం” అని పేర్కొన్న జనసేనాని.. అదే సందర్భంలో ఆయన లేవనెత్తిన అంశాలకు కౌంటర్ కూడా ఇచ్చారు. “నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. లక్ష్మీనారాయణ… జనసేన పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు.” అంటూ ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్.
లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/iBJJ4JX0KC
— JanaSena Party (@JanaSenaParty) January 30, 2020