హైదరాబాద్ శివారులో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య ఘటనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి బహిరంగ శిక్షలు ఉండాలన్నారు. ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక.. కొందరు మానవ మృగాల బారినపడి అన్యాయమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోరాన్ని మనసున్న ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రియాంక రెడ్డి కుటుంబానికి తన తరపున, జనసైనికుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. షీటీమ్స్‌ను మరింత బలోపేతం చేయాలన్న పవన్ కల్యాణ్ శివారు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలని కోరారు. విద్యార్థినుల్లో, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు ప్రయత్నం చేయాలని.. ప్రాణ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని సూచించారు.