ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ కథనం రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఏపీలో ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందన్న వార్తలు విస్మయం కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు నెలకొల్పాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తోందని అన్నారు. కొత్తవి రాకపోగా.. ఉన్న పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ సంస్థలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థగా ఉన్న కియా తన ప్లాంట్‌ను విస్తరిస్తుందనుకుంటే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధపడటం ప్రభుత్వ విధాన లోపాలను తెలియజేస్తోందని పవన్ ఆరోపించారు. మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్‌వేర్ సంస్థలను ఖాళీ చేయించారు.. రూ.24 వేల కోట్లతో కాగితం పరిశ్రమ పెడతామన్న ఏషియన్ సంస్థ మహారాష్ట్రకు వెళ్లిందని విమర్శించారు. ఇకనైనా ఉపాధి కల్పించే రంగాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించిన జనసేన అధినేత.. నిర్మాణాత్మక ఆలోచనలు, ప్రణాళికలు లేని పాలకపక్షంతో పారిశ్రామిక రంగం తరలిపోతోందని ఎద్దేవా చేశారు. అయితే రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రచారం వెనుక దురుద్దేశం ఉందని.. కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్లాంటును విస్తరణకు ప్రణాళికలు చేస్తుంటే తరలిపోయే అవకాశం ఎక్కడిదని ప్రశ్నించారు.