జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అపర అన్నపూర్ణగా కీర్తి గడించిన డొక్క సీతమ్మ తెలుగు బిడ్డగా పుట్టడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా ఆయన అంజలి ఘటించి ఆమె సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అడిగినవారికి లేదనకుండా ఆస్తులు కరిగిపోయినా డొక్కా సీతమ్మ అన్నదానం చేశారని పవన్ కొనియాడారు. అక్కడికే పరిమితం కాకుండా పేదలకు పెళ్లిళ్లు, చదువుకోవడానికి ఆర్థిక సహాయం తదితర ఎన్నో మానవీయ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆమె మరణించి వందేళ్లు దాటినా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారని చెప్పారు.
డొక్కా సీతమ్మ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యతని పవన్ చెప్పారు. గత ఏడాది భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన పార్టీ ఏర్పాటుచేసిన ఆహార శిబిరాలను డొక్కా సీతమ్మ పేరిటే నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కరోనా సమయంలోనూ ఆ అపర అన్నపూర్ణ పేరిట జనసేన శ్రేణులు పేదలకు ఆహారం అందిస్తున్నాయని.. ఆమె స్ఫూర్తిని కొనసాగిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం తెలిపారు.