
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ అవసరాల కోసం కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంతాలు.. పట్టింపులకు పోకూడదని సూచించారు. పట్టింపులు వదిలి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ”కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వ విభాగాలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి స్క్రీనింగ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్‌లు పెంచాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత కూడా తేలిగ్గా తీసుకోవడం సరికాదు. మన రాష్ట్రంలో లేదు.. వైరస్ వస్తుంది, పోతుంది అనుకొనే తరుణం కాదిది. వైరస్ విస్తృతి రెండు వారాల తర్వాతే ఉంటుందని ఇతర దేశాల అనుభవాల ద్వారా వెల్లడవుతోంది. కేంద్రం చెప్పిన విధంగా తక్షణమే అన్ని విద్యాసంస్థలను మూసివేయాలి” అని పవన్ సూచించారు.
”ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు వైద్య బృందాలను నియమించాలి. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు ప్రజలను అప్రమత్తం చేయడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. జనసేన పార్టీ తరఫున మా శ్రేణులకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళిక ఇచ్చాం” అని పవన్ కల్యాణ్ వివరించారు.













