జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపీ పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని పవన్ చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్‌లో బీజేపీ నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీతో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.