పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 10న దేశవ్యాప్తంగా విపక్షాలు తలపెట్టిన భారత్ బంద్ తమ మద్దతు ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. కార్యకర్తలు ఈ భారత్ బంద్‌లో పాల్గొనాలని ట్విటర్ ద్వారా పవన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ..మన దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, పెట్రోల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని జనసేన డిమాండ్ చేస్తోందని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. భారత్ బంద్‌లో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ సి.పి.ఎం.కార్యదర్శి శ్రీ మధు, సి.పి.ఐ కార్యదర్శి శ్రీ రామకృష్ణ, పి.సి.సి అధ్యక్షుడు శ్రీ రఘువీరారెడ్డి కోరినందుకు కృతజ్ఞతలు – జైహింద్’ అంటూ పవన్ ఓ లేఖ రాసి ట్విటర్ ద్వారా షేర్ చేశారు.