జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో మాట్లాడారు. కుటుంబాల మధ్య రాజకీయాలు నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తాను నెల్లూరులోనూ నివసించానని.. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పెరిగానని, ఇక్కడి రాజకీయాలు మార్చాలనుకుంటున్నట్టు చెప్పారు. అందుకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. మాట్లాడితే బీసీలు అంటూ బీసీ సభలు పెడుతున్నారని, ఎంతమంది బీసీలకు అండగా నిలబడ్డారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలోని బీసీలను తెలంగాణలో ఓసీలుగా మార్చిన కేసీఆర్‌ను ఈ అంశంపై ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఏపీ రాజకీయాల్లో జనసేన ఉండటం చారిత్రక అవసరమన్నారు. రాజకీయాలంటే రెండు పార్టీలు, నారా, జగన్ కుటుంబాలే చేయాలా? ఇంకెవరూ చేయొద్దా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆ పరిస్థితిని మార్చేందుకే ఈ ఎన్నికల నుంచి తాము శ్రీకారం చుట్టామని పవన్ అన్నారు. వైసీపీ నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. పోలీసులపై నమ్మకం లేదంటూ వారిని అవమాన పరుస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులపై ఇకనైనా విమర్శలు మానాలని గట్టిగా చెబుతున్నానన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఏడాదికి 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు.