ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాట్లాడారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని పునరుద్ఘాటించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌లా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తాను కలలు కనడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘నాకు సీఎం పదవి కావాలంటే బీజేపీతో చేతులు కలిపి ఎప్పుడో అయ్యేవాడిని. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జనసేనను వాళ్ల పార్టీలో కలపాలని అడిగారు. నేను అలాంటివాడిని కాదని సమాధానమిచ్చా. 2016లో ప్రత్యేకహోదా అంశంపై కేంద్రానికి గుర్తు చేసింది నేనే’ అన్నారు.
సమస్యలు పరిష్కరించాలని అడిగితే సీఎం అయితేనే చేస్తానని జగన్ అంటున్నారని, మళ్లీ సీఎం అయితే పరిష్కరిస్తానని చంద్రబాబు చెబుతున్నారని పవన్ విమర్శించారు. అరచేతితో సూర్యకాంతిని అడ్డుకోలేరని.. జనసేన ఎదుగుదలను ఎవరూ ఆపలేరని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రక్షాళన కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కులం మతం, ప్రాంతాన్ని నమ్ముకుని పార్టీ పెట్టలేదని చెప్పారు. తన దగ్గర టీవీ ఛానళ్లు, పత్రికలు లేవని.. అభిమానులే తన బలమన్నారు. ఆడపడుచుల గుండెచప్పుళ్లే తన వార్తా పత్రికలన్నారు పవన్ కల్యాణ్