జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలనపై, నిర్ణయాల నిప్పులు చెరిగారు. చంద్రబాబు భావితరాలను ప్రభావితం చేసే వ్యక్తి అనుకున్నానని, కానీ చిన్నాభిన్నం చేసే వ్యక్తి అయ్యారని పవన్ వాపోయారు. కుల రాజకీయాలు చేస్తే అందరం చిన్నాభిన్నం అవుతామని పవన్ హెచ్చరించారు. తన కంఠంలో ప్రాణం ఉండగా ఏపీని చిన్నాభిన్నం చేయడాన్ని చూస్తూ ఊరుకోనని పవన్ తేల్చి చెప్పారు. గోదావరి జిల్లాలు తన మూలాలు ఉన్న ప్రాంతమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను గళమెత్తింది కాకినాడ నుంచే అని పవన్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నంతసేపు అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.
అభిమానుల నినాదాలపై పవన్ స్పందించారు. ప్రజల దీవెనలే తనను ముఖ్యమంత్రిని చేస్తాయని పవన్ చెప్పారు. ప్రజల తరఫున పోరాటం చేసే నాయకులు ఇంకా ఉన్నారని చెప్పేందుకే తాను వచ్చానని అన్నారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే అన్ని సమస్యలు తీరుస్తానని జగన్ చెబుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. తనను సీఎం చేస్తే ఎంత కష్టమైనా భరిస్తానని ప్రజలకు మాత్రం మంచి సేవ చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. అంతేకానీ సీఎంలా, ప్రతిపక్ష నేతలా తప్పించుకోనని అన్నారు. మరోవైపు ఏపీ కేబినేట్ విస్తరణపైనా జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినేట్ విస్తరణలో భాగంగా సీఎం చంద్రబాబు గిరిజన, మైనార్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పవన్.. గిరిజన నేతలు చనిపోతేనే వారి వారసులకు పదవులిస్తారా? ఇన్నాళ్ళు మీకు గిరిజనులు గుర్తు రాలేదా? అని సీఎం చంద్రబాబును పవన్ నిలదీశారు.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు టీడీపీయే కారణం అంటూ ఆరోపించారు. నాలుగున్నరేళ్లు గుర్తుకు రాని గిరిజనులను తాను ఏదో చేశానని నమ్మించేందుకు శ్రవణ్‌కు మంత్రి పదవి ఇచ్చి వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. గిరిజనులకు మంత్రి పదవి ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చిందా అంటూ పవన్ దుయ్యబట్టారు. గిరిజనులకు విద్య వైద్య వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని పవన్ డిమాండ్ చేశారు. గిరిజనుల నివసించే అటవీ ప్రాంతాల్లో బాక్సైట మైనింగ్ తవ్వకాలను నిలిపివెయ్యాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే గిరిజనుల కోసం తూర్పు కనుమల్లో మైనింగ్‌ను నిషేధిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు విద్య వైద్య మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబులా, జగన్‌లా తాను గిరిజనులను చిన్నచూపు చూడనని తాను గిరిజన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తానని పవన్ వ్యాఖ్యానించారు. గిరిజనులు అధైర్యపడొద్దని జనసేన అండగా ఉందని గుర్తుంచుకోవాలన్నారు.
ఒక మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన గిరిజనులంతా తమవైపే ఉన్నారని చంద్రబాబు భ్రమపడుతున్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా ముస్లింలకు అన్యాయం చేసిన చంద్రబాబు ఆరునెలల్లో ఎన్నికలు ఉన్నాయని ఓట్ల కోసం పదవులు ఇచ్చారని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ముస్లింల కోసం ఏర్పాటు చేసిన సత్యార్ కమిటీని ఎందుకు అమలు చెయ్యలేదని పవన్ నిలదీశారు. కనీసం ఆ కమిటీలో ఏమి ఉందో కూడా పరిశీలించలేదన్నారు. పదవులు ఇచ్చినంత మాత్రాన ముస్లిం సోదరులు చంద్రబాబును నమ్ముతారనుకుంటే పొరపాటేనన్నారు. తాను అన్నిమతాలను గౌరవిస్తానన్న పవన్.. చంద్రబాబులా షాదీ నజరానా అంటూ ముస్లిం ఆడపడుచులను మభ్యపెట్టనన్నారు. ముస్లింలను ఎవరైనా రెండో తరగతి పౌరులుగా చూస్తే అంగీకరించేది లేదన్నారు. రాజ్యాంగంలోని అన్ని హక్కులను ముస్లిం సోదరులకు తప్పకుండా అమలు చేసి తీరుతానని పవన్ వ్యాఖ్యనించారు.