HomeTelugu Big Storiesపవన్‌కళ్యాణ్‌ మళ్లీ మేకప్‌ వేసుకోవాలి

పవన్‌కళ్యాణ్‌ మళ్లీ మేకప్‌ వేసుకోవాలి

6 22ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మళ్లీ మేకప్‌ వేసుకుని సినిమాల్లో నటించాలని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కోరారు. ‘పరుచూరి పలుకులు’ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ సినిమాల్లో రీఎంట్రీపై మాట్లాడారు. ఈ విషయంలో ఆయన ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

‘అమెరికాలో జరిగిన తానా సభలకు వెళ్లిన పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతుంటే నాకు మూడు అంశాలు అనిపించాయి. ‘ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత 15నిమిషాలు బాధపడ్డాను’ అని అన్నారు. ఆ పదిహేను నిమిషాలు కూడా మీరు బాధపడి ఉండకూడదనిపించింది నాకు. ఎందుకంటే ఓటింగ్‌ జరుగుతుండగానే మనకు ప్రపంచమంతా అర్థమైపోతుంది. అస్సలు బాధపడవద్దు. రెండోది ‘నాకు భయమెందుకు?’ అన్నారు. పవన్‌కల్యాణ్‌కు భయం ఉంటుందని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసి అతని లోపల ఒక యోగి ఉన్నాడని నేను నమ్ముతా. ఈ విషయం ఆయన బయట ప్రపంచానికి ఎప్పుడూ చెప్పలేదు. ఆ యోగి అతన్ని పాజిటివ్‌ ఎనర్జీతో నడిపిస్తున్నాడని భావిస్తున్నా. ఇక మూడో విషయం మండేలాను ఆదర్శంగా తీసుకున్నానని చెప్పారు. అక్కడిదాకా ఎందుకు పక్కన ఉన్న పాకిస్థాన్‌లోనూ తాను ప్రధాని అయ్యే వరకూ ఇమ్రాన్‌ఖాన్‌ పోరాటాన్ని ఆపలేదు.’

6a

‘సినిమాలో హీరోకు ఏ లక్ష్యం ఉంటుందో అదే లక్ష్యంతో రాజకీయ నాయకుడూ ఉండాలి. ఇటీవల జగన్‌గారినీ చూశాం. దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడుతూనే ఉన్నారు. తన తండ్రి భౌతికంగా లేనప్పుడు పదవి కావాలని అనుకున్న జగన్‌ను చూసి అందరూ అవహేళన చేశారు. ఎవరెన్ని చేసినా, ఈరోజు ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్తూ, ప్రతి అంశాన్ని తన కోణంలో మాట్లాడుతూ వెళ్లారు. పవన్‌ కళ్యాణ్‌గారికి ఒక విషయం మళ్లీ మళ్లీ చెబుతున్నా. మీరు ఐదేళ్లు మేకప్‌నకు దూరంగా ఉండొద్దు. ఎందుకంటే.. ‘నా దేశం’ లో ఒక డైలాగ్‌ ఉంది. ‘నీకు రాజకీయం నేర్చుకోవడానికి 30ఏళ్లు పట్టింది. అదే రాజకీయాన్ని నేను 3నెలల్లో ఔపోసన పట్టాను’ అన్న రామారావుగారి మాట ఎన్ని కోట్లమందికి వెళ్లిపోయిందో అందరికీ తెలిసిందే’

‘ఆర్టిస్ట్‌కు ఉన్న అదృష్టం ఏంటంటే.. ‘ మనం ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాల్సిన మాట. ఒక సినిమాలో చెబితే, ఆ డైలాగ్‌ అద్భుతంగా చేరిపోతుంది. ‘రా అంటే రాక్షసంగా, జ అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, యం అంటే యంత్రాంగం అదే ‘రాజకీయం’. ఈ డైలాగ్‌ ఏమైనా మారిందా? 1986 మార్చి 16న విడుదలైంది సినిమా. ఈ 34ఏళ్లలో ఏమీ మారలేదు. కానీ, అలాంటి వేషాలతో వాళ్లు ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. ఎంజీఆర్‌ను పవన్‌కల్యాణ్‌ ఆదర్శంగా తీసుకోవాలి. ఎంజీ రామచంద్రన్‌ పార్టీలోనే ఉన్నారు. వాళ్ల సిద్ధాంతాలన్నీ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ, తను సీఎం అయ్యే వరకూ మేకప్‌ వేసుకోవడం మానలేదు. పవన్‌కల్యాణ్‌కు ఇదే నా విన్నపం.. నువ్వు ఒక అద్భుతమైన కథాంశాలతో రాజకీయ, సోషల్‌, రైతు సబ్జెక్ట్‌లతో సినిమాలు చేయాలి. మీ అన్నయ్య ‘ఖైదీ నంబర్‌ 150′ రైతు నేపథ్యంగా తీసుకుని ఎలా రీఎంట్రీ ఇచ్చారో అలాంటి అద్భుతమైన సోషల్‌ కాన్సెప్ట్‌ చిత్రాలను తీసుకుని సినిమాలు చేయండి. మీరు సంవత్సరానికి ఒకటే చేస్తారని తెలుసు. కానీ, దాని ద్వారా మీరు చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్పండి. మీరు రాజకీయాల్లో పైకి రావాలి. మీ కోరిక నెరవేరాలి. మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అందుకు ఆల్‌ ది బెస్ట్‌’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu