ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ .. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమిని ఎవరూ ఊహించలేదని అన్నారు. ‘పరుచూరి పలుకులు’ లో భాగంగా ఆయన తాజాగా పవన్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ‘కొన్నేళ్లుగా జగన్ ప్రజల మధ్య తిరుగుతూనే ఉన్నారు. వేల కిలోమీటర్లు నడిచి.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడా ప్రతి వీధికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. జగన్‌కు కూడా ఓ సారి అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు అనుకున్నారు. అందుకే ఆయనకు ఓటు వేశారన్నది నా అభిప్రాయం’.
‘ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో నాకు తెలియదు కానీ.. జనసేన ఓడిపోవడం ఒక ఎత్తైతే, పవన్ ఓడిపోవడం మరో ఎత్తు. కలలో కూడా ఏ అభిమాని, ఆంధ్రా వాసి దీన్ని ఊహించి ఉండరు. ఆయన తప్పకుండా అసెంబ్లీకి వస్తాడని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ప్రశ్నించే హక్కును ప్రజలకు నేర్పడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఈ హక్కు గురించి చెబుతున్నా ఆయన్ను అసెంబ్లీలోకి ప్రశ్నించే హక్కు కోసం పంపించకపోవడం అనేది నమ్మశక్యం కాని నిజం. అయినా ఆయన ఓడిపోవడం ఏమిటో?’.
‘ఓ సభలో పవన్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు. పిల్లలు ఎదురుగా నిల్చుని సీఎం, సీఎం అని అరుస్తుంటే.. ‘ఒకాయన డబ్బులు పంచారు, ఇంకో ఆయన లీగల్‌గా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇక మనం సీఎం ఏంటి?’ అన్నారు. ఇవాళ పవన్ ఏది కోరారో.. అది రామారావు గారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు జరిగింది. పవన్ ప్రజాస్వామ్యంలో ఆ మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన వాటిలోనూ ఊహించని నిజాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అభివృద్ధికి సహకరించాలని, ముఖ్యమంత్రిగా జగన్ నవరత్నాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అసెంబ్లీలోకి వెళ్తేనే ప్రశ్నించడం కాదు ప్రజల్లోంచీ కూడా పవన్ ప్రశ్నిస్తుండాలని కోరుకుంటున్నా’ అని ఆయన చెప్పారు.