ముఖ్యమంత్రి జగన్ రాజన్న రాజ్యం తెస్తామని పదే పదే చెబుతుంటే ప్రజలు హడలిపోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. వైఎస్ హయాంలో దాదాపు 14 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని తలచుకొని రైతాంగం భయపడిపోతోందని, అలాంటి తరుణంలో వైఎస్ జయంతిని పురస్కరించుకొని రైతు దినోత్సవం జరుపుకోవడంలో అర్థం లేదన్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి 5 శాతం కంటే తక్కువగా నిధులు కేటాయించినా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయినా కేంద్రాన్ని ప్రశ్నించలేదని, అలాంటి జగన్ రైతు దినోత్సవాలు నిర్వహించడం రైతుల్ని మోసగించడమే అవుతుందన్నారు.
‘రైతు భరోసా’ కింద ప్రతి రైతుకు రూ.12,500 ఇస్తామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? 12,500+ కేంద్ర ప్రభుత్వం వాటా రూ.6 వేలుతో కలిపి మొత్తం రూ.18,500 ఇస్తారా? అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని అనురాధ అన్నారు. ఓ వైపు రాష్ట్రంలో అనధికారికంగా కరెంట్ కోతలు విధిస్తూనే ఉచిత విద్యుత్ ఏవిధంగా ఇస్తారో అర్థం కావడంలేదని ఆమె ఎద్దేవా చేశారు. సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వానికి, లోటు బడ్జెట్లో సైతం రూ.17,000 కోట్ల రుణమాఫీ చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు.