ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా తిరిగిరానున్నాడు. పాకిస్థాన్ కస్టడీ నుంచి అతడు క్షేమంగా భారత్‌కు చేరుకోనున్నాడు. దీంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జెనీవా ఒప్పందంలో భాగంగా అతడిని భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ రెడీ అయింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు తిరిగి పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్థాన్ పార్లమెంట్ ఉభయ సభల్లో దీనిపై అధికారిక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం వద్దని తాను కోరుకున్నానని.. ఈ దిశగా ప్రధాని మోడీతో చర్చించేందుకు మోదీకి ఫోన్ చేసినట్టు ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. తాము శాంతి కోరుకుంటున్నామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చర్చల్లో భాగంగా తొలి అడుగు వేసేందుకు పాకిస్థాన్ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్‌ను అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ పార్లమెంట్‌లో చెప్పారు. వాఘా – అట్టారీ బోర్డర్ ద్వారా అభినందన్ వర్థమాన్ భారత్‌లో అడుగుపెట్టనున్నాడు.
భారత భూభాగంలో దాడి చేయడానికి వచ్చిన పాకిస్థాన్ ఫైటర్ జెట్లను మిగ్ 21తో తరిమికొట్టేందుకు వెళ్లాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. అయితే, యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూలిపోయింది. అక్కడ అభినందన్‌ను పట్టుకుని కొందరు దాడి చేశారు. దీంతో అతడి ముఖంపై గాయమైంది. తర్వాత అభినందన్ వర్థమాన్‌ను పాక్ ఆర్మీ అధికారులు ప్రశ్నించారు. తమ వద్ద ఓ పైలెట్ కస్టడీలో ఉన్నట్టు ప్రకటించారు. దీన్ని భారత్ కూడా ధ్రువీకరించింది. అతడిని వెనక్కి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డింది. జెనీవా ఒప్పందం ప్రకారం ఓ యుద్ధ ఖైదీతో గౌరవంగా వ్యవహరించాలి. ఈ క్రమంలో పాక్ కూడా అభినందన్ వర్థమాన్‌ను వెనక్కి అప్పగించేందుకు రెడీ అయింది.