బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ డిసెంబర్ 9న వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అయితే, రాజస్థాన్‌లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్ట్ భర్వారాలో జరిగే వీరి వివాహానికి హాజరయ్యే అతిథులకు పలు నిబంధనలు విధించారు. ఈ వివాహవేడుకలో ఫొటోలు, సెల్ఫీలు తీయొద్దు.. సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని ఆంక్షలు పెట్టారు. దీని వెనుక వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉన్నాయని తెలుస్తోంది.
తాజాగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోల ప్రసారహక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 100కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే, ఈ విషయంలో కత్రినా-విక్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ ట్రెండ్ కొత్తేం కాదు.. గతంలోనూ పలువురు సెలబ్రిటీలు తమ వివాహా ఫుటేజ్‌ల ప్రసారాల కోసం సినీ మ్యాగజైన్లు, ఫొటోగ్రాఫర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే, ఒక ఓటీటీ సంస్థ వివాహావేడుక ప్రసార హక్కులను పొందేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి. ఒకవేళ కత్రినా-విక్కీ ఈ ఒప్పందానికి ఓకే చెబితే.. వారి వివాహాన్ని ఓటీటీ ప్రత్యక్షప్రసారం చేసే అవకాశముంది.