అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే ‘ఆస్కార్’ అవార్డుల ప్రదానోత్సవం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న జరగాల్సిన 93వ ఆస్కార్ వేడుకలను రెండు నెలలు వాయిదా వేసినట్లు అకాడమీ ప్రెసిడెండ్ డేవిడ్ రూబన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏటా ఈ వేడుక వచ్చిందంటే చాలు అభిమానులు, తారలకు పండగనే చెప్పాలి. వందల మంది తారలు ఈ వేడుకలో తళుక్కున మెరుస్తుంటారు. అయితే, ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న అవార్డుల వేడుకను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమాలు విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పటికే ‘నో టైమ్ టు డై’, ‘టాప్ గన్: మార్విక్’, ‘ములాన్’, ‘బ్లాక్ విండో’ చిత్రాలను కొంతకాలం వాయిదా వేస్తున్నామని ఆయా చిత్రబృందాలు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 92 ఏళ్లలో ఆస్కార్ వేడుకలు వాయిదా పడటం ఇదే తొలిసారి.