ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని, త్వరలోనే ఈ దేశ ప్రజలు మోడీని సాగనంపుతారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీదీ నేతృత్వంలో కోల్‌కతా వేదికగా ప్రతిపక్షాల భారీ ఐక్యతా ర్యాలీ జరిగింది. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీల నేతలు ఈ ర్యాలీకి హాజరై కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ర్యాలీ ఆఖర్లో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాలన తీరుపై మండిపడ్డారు.
“తాను మాత్రమే అవినీతి రహితంగా ఉన్నామని మోడీ చెబుతారు. కానీ ఆయన హయాంలోనే రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలాంటి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగాయని, నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేశారని, రాజకీయాల్లో లక్ష్మణరేఖ లాంటిది ఉంటుందని.. దాన్ని బీజేపీ దాటిందని అన్నారు. మీతో కలిసే ఉంటే ఫర్వాలేదు. లేదంటే ఎవరినైనా సరే అణగదొక్కుతారు. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేశ్, మాయావతి సహా ఎవర్నీ వదల్లేదు. ఇక మోడీ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. బీజేపీని ఓడించడమే కాదు మూలాలతో సహా పెకిలించాలి. ప్రాంతీయ పార్టీలను ఓడించేందుకు భాజపా చేసే కుట్రలు పనిచేయవు. ఈ వేదిక ఐక్య భారత్‌కు నిదర్శనంగా నిలవాలి” అని మమత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వ సంస్థలను అవమానించిందని, సీబీఐ, ఈడీని కూడా వదల్లేదని దీదీ దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఈసారి ప్రజలు బీజేపీకి ఓటేస్తే వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న కాస్త డబ్బు కూడా తిరిగి రాదని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని, అసలు ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్లు ఇవ్వడంలో అర్థమేంటని ప్రశ్నించారు. బీజేపీ హాయంలో మంచి రోజులే రాలేదని విమర్శించారు. నవ భారతాన్ని నిర్మించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయని మమత అన్నారు. ప్రధాని ఎవరన్నదానిపై తాను ఆలోచించట్లేదని.. బీజేపీని వెళ్లగొట్టడమే తమ లక్ష్యమని మమతా బెనర్జీ స్పష్టంచేశారు.
శనివారం పశ్చిమబెంగాల్‌లో జరిగిన బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బల ప్రదర్శన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. ప్రధాని మోదీపై మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను జంతువుల్లా కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపుతప్పుతున్నాయని అన్నారు.
ఏమాత్రం అనుభవం లేని రిలయెన్స్‌కు రాఫెల్ డీల్ కట్టబెట్టడం ఏమిటని మోదీ సర్కార్‌ను నిలదీశారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌షాలను కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు. దేశమే అందరికీ ముఖ్యమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.