Operation Valentine: మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్.. ఫిదా, తొలిప్రేమ తరువాత సరైన హిట్ లేని వరుణ్ తేజ్ ఈ సినిమాతో అయిన హిట్టు కొట్టలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన హీరోగా నటిసున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ చిత్రం ఈరోజు (మార్చి 1)న విడుదలైంది. పుల్వామా దాడుల నేపథ్యంతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరుకూ ఆకట్టుకుందో చూద్దాం.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వజ్ర అనే ఓ మిషన్‌ను టెస్ట్ చేస్తుంటుంది. 20 మీ. ఎత్తులో జెట్‌ను నడిపితే.. రాడార్‌కు చిక్కకుండా ఉండే కాన్సెప్ట్ కావడంతో దాన్ని పరీక్షించాలనుకుంటాడు వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్). ఆ పరీక్ష విఫలం కావడంతో జరిగిన ప్రమాదంలో కబీర్ (నవదీప్) మరణిస్తారు. దీంతో ఆ టెస్ట్‌ను, వజ్ర మిషన్‌ను పక్కన పెట్టేస్తుంది మరో వింగ్ కమాండర్ ఆహ్నా గిల్ (మానుషి చిల్లర్). ఆ తరువాత కొన్నేళ్లకు అర్జున్ దేవ్ కోలుకుంటాడు. 2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ దాడి చేస్తుంది. పుల్వామా ఎటాక్‌లో మన వీర సైనికులు మరణిస్తారు. దీంతో ప్రతీకార చర్య తీర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి వస్తుంది. ఆ తరువాత పాకిస్తాన్ చేపట్టిన చర్యలు ఏంటి? వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అడ్డుకుంది? నెహ్రూ అనే కోడ్‌తో పాకిస్థాన్ చేయదల్చుకున్న దాడి ఏంటి? వీటిని వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ ఎలా తిప్పి కొట్టాడు? అన్నది తెరపై చూడాల్సిందే.
పుల్వామా దాడిలో మన సైనికులు చనిపోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది. అంతటి ఎమోషన్ ఉన్న పాయింట్‌ను ఎంచుకున్నాడు దర్శకుడు. అది జనాలకు ఎంతగా కనెక్ట్ కావాలి. కానీ ఆ ఎమోషన్ ఇందులో కనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా ఏదేదో జరిగిపోతోన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఏం జరగదు. అంతా సెకండాఫ్ కోసం సెటప్‌లానే అనిపిస్తుంది. కొన్ని సార్లు ఆ పదాలు అర్థం కావు. తెరపై ఏదో జరుగుతోందని మాత్రం తెలుస్తుందంతే. కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా పండలేదు. అదే ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్.
ఇక సెకండాఫ్ లో అసలు కథ మొదలౌతుంది. మన వాళ్లు సర్జికల్ స్ట్రైక్ ఎలా చేశారో ఎవరికి తెలీదు. అదొక సీక్రెట్ ఆపరేషన్. దాన్ని ఇందులో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. నాలుగు నిమిషాల్లోనే పని ఖతం చేసిన మన ఎయిర్ ఫోర్స్ ఘనతను ఇందులో చూపించాడు. పాకిస్తాన్‌లోకి వెళ్లి ఉగ్ర స్థావరాలను మట్టు బెట్టి తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదు. సాహసమనే చెప్పాలి. ఆ సాహసాన్ని మన వైమానిక దళం చేస్తుంది. పుల్వామా దాడుల ప్రతీకారంగా మన దేశం ఈ సర్జికల్ స్ట్రైక్‌ను చేపట్టింది.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళంగా, నత్తనడకగా.. ఎమోషనల్‌గా కనెక్ట్ చేయించలేకపోవడంతో నీరసంగా అనిపిస్తుంది. సెకండాఫ్ ప్రారంభం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం దేశ భక్తి నరనరాల్లోకి వచ్చేస్తుంది. మన ఎయిర్ ఫోర్స్ గొప్పదనం, ధైర్య సాహసాలు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మధ్య మధ్యలో నరేంద్ర మోడీ లాంటి పాత్ర ఒకటి అలా కనిపించీ కనిపించకుండా వస్తుంటుంది. ఈ సినిమా మరీ తీసి పారేసేలా ఉండదు. ఫస్ట్ హాఫ్‌ను కొంచెం బోర్ కొడుతుంది. సెకండాఫ్‌ను కాస్త ఎంజాయ్ చేయొచ్చు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాను కాపాడతాయి. ఓవరాల్‌గా ఒకసారి చూడదగ్గ చిత్రంగా మాత్రం ఈ ఆపరేషన్ వాలెంటైన్ నిలుస్తుంది.
వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా అర్జున్ దేవ్ పాత్రలో బాగా నటించాడు. ఆ హైట్, ఆ వెయిట్ చూస్తుంటే నిజంగానే మనం ఓ వింగ్ కమాండర్‌ను చూసినట్టుగానే అనిపిస్తుంది. ఎమోషనల్‌గా నటించాడు. మానుషి చిల్లర్ తెరపై అందంగా కనిపిస్తుంది. అంతే ఎమోషనల్‌గానూ నటించింది. నవదీప్‌కు కారెక్టర్ పెద్దగా లేదు. ఓ మూడు నాలుగు సీన్లలో కనిపిస్తాడంతే. ఈ చిత్రంలో బిగ్‌బాస్ బ్యాచ్ చాలానే కనిపిస్తుంది. శుభ శ్రీ, లహరి, శ్వేతా వర్మ ఇలా అందరూ కనిపిస్తారు. కానీ వారి పాత్రలకు అంతగా ఏమీ ఇంపార్టెన్స్ ఉండదు. టెక్నికల్‌గా కొన్ని సార్లు వావ్ అనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు వీఎఫ్ఎక్స్ తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. విజువల్స్ బాగున్నాయి. మిక్కి జే మేయర్ ఆర్ఆర్ బాగుంది. మాటలు అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. నిడివి తక్కువగా ఉండటం కలిసి వస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.