తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరినదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటు వెలికితీతలో పురోగతి సాధించారు. సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్‌ల మునిగిపోయిన బోటుకు కట్టి వెలుపలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో కొంత పురోగతి సాధించారు. మరికొద్ది సేపట్లో బోటును పూర్తిగా వెలికితీయవచ్చని భావిస్తున్నారు. సుడిగుండాలు లేకపోవడం.. గోదావరి నీటిమట్టం 38-40 అడుగుల స్థాయిలోనే ఉండటంతో బోటును వెలికితీసేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా ఐదోరోజు నీటిమట్టం తగ్గడం అనుకూలించింది. రాయల్ వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీత పనులను కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్‌కు చెందిన పది మంది డైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు ఆదివారం ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు. దాదాపు 15 నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంతమేర పేరుకుపోయాయి? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలించి వచ్చి పోర్టు అధికారికి వివరించారు.
ఇలా 6 సార్లు డైవర్లు బోటు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరిలో బోటు ఏటవాలుగా మునిగి ఉందని పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ విలేకర్లకు తెలిపారు. నదిలో బోటు ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటే, వెనుక భాగం దాదాపు 70 అడుగుల లోతులో ఉందని చెప్పారు.