మరి కొద్ది గంటల్లో భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 2 చందమామపై కాలుమోపి జాబిల్లిని పలకరించబోతోంది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లోని అత్యంత కీలకమైన మాడ్యూల్ ల్యాండర్ విక్రమ్ అర్థరాత్రి తర్వాత చంద్రుడిపై దిగనుంది. ఇది దేశ చరిత్రలోనే అందరూ గర్వించదగ్గ సందర్భం. అర్ధరాత్రి దాటిన తర్వాత చారిత్రక ఘట్టానికి తెరలేవనుంది. ఇస్రో శాస్త్రవేత్తల కఠోరశ్రమకు ఫలితం దక్కాలని 48 రోజుల అద్భుత ప్రయాణం విజయవంతంగా ముగియాలని 130 కోట్ల మంది భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈరోజు అర్ధరాత్రి దాటిన తరువాత అంటే 1 గంట నుంచి 2 గంటల మధ్య చంద్రుడి దక్షిణ ధ్రువంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో మాంజీన్‌స-సి, సీంపేలియ్‌స-ఎన్ అనే రెండు చంద్ర బిలాల మధ్య ఎగుడుదిగుళ్లు లేని, సమతులంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్‌కు అమర్చిన అర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా ద్వారా అన్వేషిస్తారు. అక్కడ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లు ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు.
అలా అరగంటలో స్థల అన్వేషణ పూర్తి చేసి 1.30 నుంచి 2.30 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్‌ను జాబిల్లిపై దించే ప్రయత్నం చేపట్టనున్నారు. ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. 1.40 నుంచి 1.55 గంటల మధ్య అంటే 15 నిమిషాలపాటు ఈ ల్యాండింగ్ ప్రక్రియ జరగనుంది. ఆ 15 నిమిషాలు ప్రయోగంలోని కీలక ఘట్టం. ఎందుకంటే.. ఈ 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తు అయితే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే 15 నిమిషాలు మరో ఎత్తు. విక్రమ్ ల్యాండింగ్‌ను ప్రధాని మోదీ బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుంచి తిలకించనున్నారు. ప్రధానితో పాటు ఇస్రో నిర్వహించిన స్పేస్ క్విజ్‌లో విజేతలైన 60 మంది విద్యార్థులు ఈ ల్యాండింగ్‌ను తిలకించనున్నారు.