”అతను కాలేజీలో చదువుతున్న కుర్రాడు. ప్రశాంతంగా సాగుతున్న అతని జీవితంలోకి అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి. ఆ అవరోధాలను అతను ఎలా అధిగమించాడు” అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘శంకర’. నారా రోహిత్ హీరోగా నటించిన ‘శంకర’ అక్టోబర్ 21న విడుదల కానుంది. రెజీనా నాయికగా నటించారు. తాతినేని సత్య ప్రకాశ్ దర్శకత్వం వహించారు. శ్రీ లీలా మూవీస్ పతాకంపై రూపొందింది. జె.ఆర్.మీడియా ప్రై.లిమిటెడ్‌తో కలిసి ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) నిర్మించారు. ఎం.వి.రావు సమర్పించారు. తమిళంలో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న ‘మౌనగురు’ చిత్రానికి రీమేక్ ఇది. అక్కడ అరుళ్‌నిధి హీరోగా నటించారు. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర కాసుల సవ్వడి చేసింది.
‘శంకర’ చిత్రం గురించి నిర్మాత ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) మాట్లాడుతూ.. ”వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు శంకర అనే కుర్రాడికి నచ్చవు. వాటిని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న అడ్డంకులు ఎలాంటివి? దానికి అతని తల్లి, సోదరుడు ఇచ్చిన చేయూత ఎలాంటిది వంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం మా ‘శంకర’. సాయికార్తిక్ మంచి సంగీతాన్నిచ్చారు. ట్యూన్లకు చక్కటి స్పందన వస్తోంది’ అ’ని అన్నారు.
చిత్ర సమర్పకుడు ఎం.వి.రావు మాట్లాడుతూ.. ”అక్టోబర్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది. నారా రోహిత్ కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది” అని చెప్పారు.