ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘ఇచ్చిన ప్రతిమాట నిలబడాలి, చేసిన ప్రతి పని కనపడాలి, ఇన్‌టైమ్ ఆన్ డోర్’ అంటూ బాలయ్య (ఎన్టీఆర్ పాత్రలో) పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడిగా కనిపించారు. ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అని బాలయ్య నాయకుడిగా తన మనసులోని మాట చెప్పడం ఆకట్టుకుంది. ‘మహానాయకుడు’లో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా ప్రజలకు చేసిన సేవ, ఎదుర్కొన్న సవాళ్లను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రాబోతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగం ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ సంక్రాంతికి విడుదలై, మంచి టాక్ అందుకుంది. రెండో భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 22న విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమా నిడివి 2 గంటల ఎనిమిది నిమిషాలు ఉంటుందని యూనిట్ పేర్కొంది.
ఈ బయోపిక్‌లో బసవతారకం పాత్రను విద్యా బాలన్ పోషించారు. హరికృష్ణగా కల్యాణ్‌రామ్, చంద్రబాబుగా రానా, ఏఎన్నార్‌గా సుమంత్ నటించారు. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సంస్థ సమర్పిస్తోంది. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్ సినీ జీవితం ఎలా సాగిందో ‘కథానాయకుడు’ లో చూపించారు.