ఎన్టీఆర్ కథని చెప్పడమంటే మాటలా? కథానాయకుడిగా ఆయన ఎక్కిన శిఖరాలు చూపించాలి. రాజకీయ నేతగా ఆయన చేసిన విజయయాత్రని తెరపైకి ఎక్కించాలి. అదో సుదీర్ఘ ప్రయాణం.. మహా సంగ్రామం. అందుకే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని సంకల్పించారు బాలకృష్ణ – క్రిష్. కథానాయకుడు ఈ సంక్రాంతికి విడుదలైంది. ఈరోజు ‘మహా నాయకుడు’ విడుదలైంది. ‘కథానాయకుడిగా’ ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజయాలకు తొలి భాగం పట్టం కడితే.. మహా నాయకుడిగా ఆయన సాగించిన జైత్ర యాత్రకు ‘మహానాయకుడు’ పట్టం కట్టింది. మరి ఆ ఘట్టాన్ని క్రిష్ సమర్థంగా తెరకెక్కించాడా? నందమూరి తారక రామారావుగా బాలకృష్ణ ఏ స్థాయిలో రాణించాడు? చంద్రబాబు పాత్రలో రానా ఏవిధంగా ఆకట్టుకున్నారు? ‘మహానాయకుడు’ తో ఎన్టీఆర్ జీవితం సంపూర్ణంగా ఆవిష్కృతమైందా?
కథ: ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నా’ అనే రాజకీయ ప్రకటన చేయడంతో ‘కథానాయకుడు’ ముగిసింది. మరి ఆయన రాజకీయ ప్రస్థానం సాగించిన విధానం ఎలానో ‘మహానాయకుడు’ చూపించింది. పార్టీ ప్రకటన చేసిన 9 నెలలలోపే ఆయన అధికారంలోకి ఎలా రాగలిగారు? అప్పటి ఇందిరాగాంధీ నిరంకుశత్వానికి ఎలా సమాధానం చెప్పగలిగారు?. తన వెంటే ఉండి, రాజకీయంగా దెబ్బతీయాలని చూసిన వాళ్లెవరు? ఆ కుట్రల నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే ఈ చిత్రం. అయితే ఈ కథని కేవలం రాజకీయాలకు పరిమితం చేయలేదు. తన అర్ధాంగి బసవతారకంతో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ… ఆ కోణంలో కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కించారు. ఈ రెండింటినీ సమాంతరంగా ఎలా చూపించారో తెరపైనే చూడాలి.
విశ్లేషణ: ఇది ఎన్టీఆర్ కథ అనేది పక్కన పెట్టి చూస్తే… ఓ రసవత్తరమైన రాజకీయ చిత్రంగా ‘మహానాయకుడు’ని అభివర్ణించవచ్చు. ఓ కథానాయకుడు పార్టీని స్థాపించడం, ఆ మరుసటి ఎన్నికలలోనే తన పార్టీని అధికారంలోకి తీసుకురావడం, పైగా కేంద్రంలోని నిరంకుశత్వ ధోరణికి ఎదురొడ్డి పోరాటం చేయడం ఇవన్నీ అబ్బురపరుస్తాయి. నిజానికి ఇదంతా జరుగుతుందా? సినిమా నటులకు అంత శక్తి ఉందా? అనిపిస్తుంది. కానీ ఇది చరిత్ర. జరిగిన వాస్తవం. కాబట్టి – ఆ ఉదంతాలు ఎన్టీఆర్‌లోని ప్రబలమైన శక్తిని ప్రతిఫలిస్తాయి.
అధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌కి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని తగ్గించడంతో ఆయన విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఉదంతాన్ని కూడా తెరపై చూపించగలిగారు. ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సివచ్చింది? చేసిన పొరపాటుని గ్రహించి మళ్లీ ఎందుకు వెనకడుగు వేయాల్సివచ్చింది? అనేదానికీ ఈ సినిమాలో సమాధానాలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కరరావు నమ్మించి ఎలా మోసం చేశారు? అధికార దాహంతో ఎన్టీఆర్‌ని సీఎం కుర్చీ నుంచి ఎలా దింపాలని చూశారు? అనేది అసలు కథ. ఆ కుట్రలు, కుతంత్రాల నేపథ్యంలో ద్వితీయార్ధాన్ని ఆసక్తిదాయకంగా మలిచాడు క్రిష్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరారు? దానికి గల కారణాలేంటి? నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌కి ఎదురైన అవమానాలు, ఎం.ఎల్.ఏలను ఢిల్లీకి తీసుకెళ్లి బలనిరూపణ చేయడం, ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాలపై పోరాటం చేయడం.. ఈ సన్నివేశాలన్నీ రక్తికట్టిస్తాయి. ఈ సినిమా మొత్తం బసవతారకం కోణంలో సాగుతుంది. ఆమె మరణమే.. ఎన్టీఆర్ కథకు తుది అంకం.
నటీనటులు: ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ ఒదిగిపోయిన విధానం ‘కథానాయకుడు’లో చూశాం. ఈ సినిమా దానికి కొనసాగింపు. ఎన్టీఆర్ గా మరోసారి బాలకృష్ణ తన వంతు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. హావ భావాల ప్రదర్శనలో, సంభాషణలు పలికే విధానంలోనూ సమతూకం పాటించాడు. రాజకీయ నాయకుడిగా, భర్తగా ఆయన పాత్రలో రెండు పార్శ్వాలుంటాయి. రెండు చోట్లా.. బాలయ్య రెండు రకాలుగా కనిపిస్తాడు. విద్యాబాలన్ పాత్ర మొత్తం భావోద్వేగాల భరితంగా సాగింది. ఆమె నటన బసవతారకం పాత్రకు మరింత వన్నె తెచ్చింది. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటన ఆకట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు బాడీ లాంగ్వేజ్‌ని రానా పుణికి పుచ్చుకున్నాడు. కొన్ని పదాల్ని చంద్రబాబు ఎలా పలుకుతారో మనందరికీ తెలుసు. రానా కూడా అదే విధానంతో పలికించాడు. ఏఎన్నార్‌గా సుమంత్‌ని ఒకే ఒక్క సన్నివేశానికి పరిమితం చేశారు. కల్యాణ్ రామ్ కూడా అక్కడక్కడ కనిపిస్తాడంతే.
క్రిష్ పాత్రల్ని మలచుకున్న విధానం బాగుంది. ఏది ఎంత వరకూ చెప్పాలో అంతే చెప్పాడు. మాటలు ఆకట్టుకున్నాయి. ఆసుపత్రి ఎపిసోడ్ లో బుర్రా సాయిమాధవ్ కలం మరింత పదునుగా పలికింది. ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలూ బాగున్నాయి.
టైటిల్ : యన్.టి.ఆర్ ‘మహానాయకుడు’
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా, విద్యాబాలన్, సచిన్ కేద్కర్ తదితరులు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
హైలైట్స్
కొన్ని ఎమోషనల్ సీన్స్
డ్రాబ్యాక్స్
అసంపూర్తి కథ
చివరిగా : ఎన్టీఆర్ కుటుంబ – రాజకీయ చిత్రం ‘మహానాయకుడు’
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)