తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 50 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకు తారకరామ సాగర్ గా పేరు మార్చారు. విగ్రహం ఆవిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల బోటులో విహరించారు. చెరువు పక్కనే ఉన్న 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కును, వావిలాల ఘాట్ ను కూడా చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటైందన్నారు.