NTR Jayanti: తెలుగు భాషకు, తెలుగు వారికి, తెలుగు సినిమాకు ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. నటుడిగా ఎన్నో గొప్ప సినిమాలతో ప్రేక్షకులని అలరించి రాజకీయ నాయకుడిగా ప్రజాపాలన చేసి తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.
ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి, ఎప్పటికి తెలుగువారి గుండెల్లో నిలిచే ఉంటారు. గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న చోట ఘనంగా నిర్వహించారు. నేడు (మే28) ఎన్టీఆర్ 101వ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.
1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో కన్ను తెరచిన ఎన్టీఆర్, తరువాత జనం మదిలో ‘అన్న’గా నిలచి జేజేలు అందుకున్నారు. కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి రైతుబిడ్డగా పయనం సాగించి.. సినీ, రాజకీయ రంగాల్లో .. చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన నటజీవితం, రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక పాత్రల్లో అలరించిన ఘనత యన్టీఆర్ సొంతం.
జానపదాల్లో కథానాయకునిగా అత్యధిక పర్యాయాలు ఆకట్టుకున్న వైనం కూడా రామారావు సొంతమే! ఒక పౌరాణిక పాత్ర (శ్రీకృష్ణ పాత్ర)ను 20 సార్లకు పైగా తెరపై ఆవిష్కరించిన ఘన చరిత కూడా నందమూరి ఖాతాలోనే చేరింది. తెలుగునేలపై నడయాడిన పలు చారిత్రక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి జనం మదిలో ఆ యా పేర్లు వినగానే ఎన్టీఆరే మెదిలేలా చేసిన అభినయవైభవమూ ఆయనది.
మూవీ ఇండస్ట్రీలోనే కాదు, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ నభూతో నభవిష్యత్ అనే విధంగా సాగారు. 1982 మార్చి 29న పార్టీని నెలకొల్పి, 1983 జనవరి 9 నాటికి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే కేవలం తొమ్మిది నెలల రెండు వారాలలో ఓ పార్టీని నెలకొల్పి, విజయకేతనం ఎగురవేయడం అన్నది కూడా ఓ చరిత్ర అనే చెప్పాలి. అదీ కూడా ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా.
ఆయన అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అంటూ తెలుగు రాజకీయ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రజానేత. ముఖ్యమంత్రిగా స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది.
తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీవీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి, జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం, మునసబు వంటి ఫ్యూడల్ వ్యవస్థలను రద్దుచేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేశారు. అనేకమందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు.
తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా గాక సాంఘిక విప్లవ సాధనంగా తీర్చిదిద్దారు. ఆద్యంతం పేదల పెన్నిధిగా జీవించారు. ఎన్నాళ్లైనా చెక్కు చెదరని జ్ఞాపకం ఎన్టీఆర్. కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయ రంగంలోనూ జనం అదే స్థాయిలో ఎన్టీఆర్ ను ఆదరించడం అన్నది నిజంగా ఓ అద్భుతం అనే చెప్పాలి.