HomeTelugu Trendingనిజంగా చచ్చిపోతానేమోనని భయమేసింది: పోసాని కృష్ణమురళి

నిజంగా చచ్చిపోతానేమోనని భయమేసింది: పోసాని కృష్ణమురళి

7 29ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి.. ఎటువంటి పదవులూ ఆశించకుండా వైసీపీ కోసం పనిచేశానని చెప్పారు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురై, కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో వచ్చిన వదంతుల్ని కూడా పోసాని ఖండించారు. కాగా బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన అనారోగ్యం గురించి మాట్లాడారు.

‘ఇన్నాళ్లూ నాకు మీడియా చాలా సహాయం చేసింది. మరోసారి మీ సహాయం కోసం ఈ సమావేశం పెట్టా. మే 13న నేను అస్వస్థతకు గురయ్యా. చిన్న సమస్యే, ఆపరేషన్‌ చేశారు. దురదృష్టవశాత్తు ఇన్ఫెక్షన్‌ సోకింది. కానీ వైద్యులు దాన్ని గుర్తించలేదు. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. రెండు నెలలు ఇలా బాధపడ్డా. నిజంగా చచ్చిపోతానేమోనని భయమేసింది. దాదాపు 10 కిలోల బరువు తగ్గా. వైద్యులు మళ్లీ స్కాన్‌ చేసి, తగ్గిపోతుందని ఇంటికి పంపారు. మళ్లీ జ్వరం వచ్చింది. దీంతో పెద్ద డాక్టర్‌ను కలిశాం. ఆయన చూసి.. ఇది ఇన్ఫెక్షన్‌ అని చెప్పారు. ఆ రోజు ఆయన కనిపెట్టకపోయి ఉంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేవాడ్నికాదు. తర్వాత గంట వ్యవధిలోనే ఆపరేషన్‌ చేశారు. ఈ క్రమంలో సోషల్‌మీడియా, యూట్యూబ్‌లో ‘విఫలమైన ఆపరేషన్‌.. విషమ పరిస్థితిలో పోసాని..’ అని రాశారు. నా భార్య చూసి ఇదేంటండి అంది. ఈ ప్రచారం వల్ల చిత్ర పరిశ్రమలో నాకు వేషం ఇచ్చేవారు కూడా ఆరోగ్యం బాగోలేదని ఇవ్వరు. పబ్లిక్‌ కూడా ఇలానే అనుకుంది. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. రెండు ఆపరేషన్‌లు చేశారు’.

‘వైసీపీకి నేను మద్దతు తెలిపా. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆ తర్వాత మీరు ఏ పదవి ఆశిస్తున్నారని నన్ను ఆయన స్వయంగా అడిగారు. నాకు ఏ పదవీ వద్దు అన్నాను. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో జగన్‌ ఉత్తమం అని నాకు అనిపించింది. అందుకే సపోర్ట్‌ చేశా. నేను ఏ పదవులూ కోరడం లేదు. పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశాను. జగన్‌ పనితీరు ప్రజలకు నచ్చింది. ప్రతిపక్షాలకు నచ్చాల్సిన అవసరం లేదు. లోకేశ్‌ బాగా తీరికగా ఉన్నారు.. అందుకే ట్వీట్లు చేస్తున్నారు. ఏపీలోనూ చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయి’.

‘ప్రస్తుతం నేను ఏడు సినిమాల్లో నటిస్తున్నా. కొరటాల శివ కొత్త సినిమా, మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లరి నరేష్‌ సినిమా, రాజ్‌తరుణ్‌ సినిమాలో నటిస్తున్నారు. కొన్ని చిన్న ప్రాజెక్టులకు కూడా సంతకం చేశా. వరుసగా షూటింగ్‌లకు వెళ్తున్నా. కానీ నేను సెట్‌కు కాదు.. ఆసుపత్రికి వెళ్తున్నానని జనాలు అనుకుంటున్నారు (నవ్వుతూ)’ అని పోసాని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu