Homeతెలుగు Newsతెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల కోలాహలం

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల కోలాహలం

16 4తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కోలాహలం కొనసాగుతోంది. ముహూర్తం పరంగా శుక్రవారం మంచిరోజు కావడం.. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో ఈరోజే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ, తెలంగాణల్లో పలువురు ప్రముఖులు నామినేషన్లు వేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా సీఎం చంద్రబాబు తరఫున స్థానిక నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. కుప్పం తహసీల్దార్‌ కార్యాలయంలో రెస్కో ఛైర్మన్‌ పి.ఎస్‌.మునిరత్నం, ఉడా ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యం రెడ్డి, గుడిపల్లి మాజీ ఎంపీపీ భవాని తదితరులు చంద్రబాబు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నామినేషన్‌ వేశారు. మధ్యాహ్నం 1.49 గంటలకు ముహూర్తం చూసుకుని నామినేషన్‌ పత్రాలను ఆర్వో సత్యంకు అందజేశారు. జగన్‌ వెంట మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌రెడ్డి నామినేషన్‌ కార్యాలయానికి వెళ్లారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మంత్రి నారా లోకేశ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ శ్రేణులతో భారీ ర్యాలీగా మంగళగిరి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన 2 సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి లోకేశ్‌ తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌ హాజరయ్యారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్‌ వేశారు. తొలుత సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో తన సతీమణి వసుంధరతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి వందలాది కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. నామినేషన్‌ వేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని.. గతం కంటే ఈసారి టీడీపీకి ఎక్కువ స్థానాలువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు జోరందుకున్నాయి. నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత, నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.

15a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu